Best Telugu News Portal.

ఆఫ్రికా నుంచి హబ్సిగూడ దాకా! బానిసలుగా వచ్చి బాద్షాలు అయ్యారు.

0

తెలంగాణా లోని హైదరాబాద్‌ నగరంలో హబ్సిగూడ ప్రాంతానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? ఈశాన్య ఆఫ్రికాకు చెందిన హబ్సీ తెగ ప్రజలు హైదరాబాద్ పాలకుల వద్ద కూలీలుగా, పశువుల కాపర్లుగా పనిచేసేందుకు వలస వచ్చి ఇక్కడే ఉండిపోయారు. దీంతో ఆ ప్రాంతం హబ్సిగూడ అయ్యింది.Africa to Habsiguda

ఇప్పటికి హైదరాబాద్‌లో కొన్ని ప్రాంతాల్లో హబ్సీలు ఉన్నారు. శతాబ్దాలుగా ఇక్కడ నివసిస్తున్న వారంతా ఇప్పుడు హైదరాబాదీలైపోయారు. మరియు హైదరాబాద్‌లోనే కాక భారత్‌లోని ఇతర ప్రాంతాల్లో కూడా ఆఫ్రికా ప్రజల ముద్ర ఉంది. ఈ దేశంలోని కొన్ని ప్రాంతాలను వారు పాలించారు కూడా.

భారత్, ఆఫ్రికా ల మధ్య సంబంధాలు ఈనాటివి కావు. వాణిజ్యం, సంగీతం, కళలకు సంబంధించి రెండు ప్రాంతాల మధ్య సాంస్కృతిక బదిలీ జరిగినట్లు చరిత్ర చెప్తోంది. కానీ, విభిన్నమైన ఈ రెండు ప్రాంతాల చారిత్రక సంబంధాలపై పెద్దగా చర్చ జరగలేదు. నిజానికి ఆఫ్రికా ఖండం నుంచి భారత్‌కు ఎక్కువ మంది బానిసలుగా, వర్తకులుగా వచ్చారు. అనుకోకుండా ఇక్కడి యుద్ధాలు, దురాక్రమణలు, రాజ్యాల్లో కొందరు కీలక పాత్రలు పోషించారు. అలాంటివారిలో మాలిక్ అంబర్ (1548-1626) పేరు ముందు వరుసలో ఉంటుంది.

ఆంధ్రాలోనూ ఆఫ్రికా గుర్తులు:

Malik Amber

అహ్మద్‌నగర్ ప్రాంతాన్ని పరిపాలించిన మాలిక్ అంబర్ సైనిక వ్యూహకర్తగా, ఆ ప్రాంతంలో ముఖ్య పరిపాలకుడిగా గుర్తింపు పొందాడు. మొఘల్ చక్రవర్తులను ఎదిరించిన ధీశాలిగా చరిత్రకెక్కాడు. ఆయనొక్కడే కాదు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రస్తుత కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతం కూడా 1678 నుంచి పదేళ్ల పాటు హబ్సి అయిన ‘సీదీ మసూద్’ పాలనలో ఉంది. గుజరాత్‌లోని సచిన్‌లో 1791లో ఆఫ్రికన్ల రాజ్యం ఏర్పడి కొన్నాళ్లు సాగింది.

చరిత్రను గుర్తు చేశారు:

ఈ మధ్య ‘ఛాంబర్గ్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ బ్లాక్ కల్చర్ ఆఫ్ ది న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరీ’ ఆధ్వర్యంలో దిల్లీలో నిర్వహించిన ఓ ప్రదర్శనలో చరిత్ర పుటల్లో కలిసిపోయిన ఈ కథలు మళ్లీ వెలుగుచూశాయి. అక్కడ ప్రదర్శించిన చిత్రాలు భారత చరిత్రలో ఆఫ్రికా పాత్రను చర్చకు తెచ్చాయి.

ఈశాన్య ఆఫ్రికాలోని ఎరిత్రియా, డిజిబౌటి, ఇథియోపియా, సోమాలియాలను కలిపి అబిసీనియా, హార్న్ ఆఫ్ ఆఫ్రికా అని అంటారు. అక్కడివారిని అబిసీనియన్లు, హబ్సిలుగా పిలుస్తారు. ఆ ప్రాంతం నుంచి భారత్‌‌కు మొదట్లో చాలామంది బానిసలుగా వచ్చారు. ఆ తరువాత వివిధ ప్రాంతాల్లోని రాజులు తమ సైన్యంలో పనిచేసేందుకు, కోట గుమ్మాల వద్ద కాపలాకు, అంగరక్షకులుగానూ తీసుకొచ్చారు. అలా వచ్చినవారిలో కొందరు ఇక్కడ మంచి స్థితికి చేరగలిగారని ఛాంబర్గ్ సెంటర్‌కు చెందిన డాక్టర్ సిల్వేన్ తెలిపారు. వారి పరాక్రమమే వారిని సైన్యాల్లో కీలక పాత్ర పోషించేలా, పాలకులుగా మార్చిందన్నది ఆమె అభిప్రాయం.

సంగీతాన్నీ తీసుకొచ్చారు:

భారత్‌కు ఆఫ్రికన్ల రాక నాలుగో శతాబ్దం తొలినాళ్లలోనే మొదలైనా 14, 17 శతాబ్దాల మధ్య.. వర్తకులుగా, పాలకులుగా, సంస్కర్తలుగా ఎదిగినట్లు చరిత్ర చెప్తోంది. అంతేకాదు, వారు తమతో పాటు ఆఫ్రికా సంప్రదాయ సంగీతాన్ని, సూఫీ శైలినీ తీసుకొచ్చారు.

ఆఫ్రికా నుంచే ఎందుకు?

Golconda Abdullah Qutb Shah

గోల్కొండ సుల్తానులు ఆఫ్రికా నుంచి వీరిని తేవడానికి ఒక కారణం ఉంది. అప్పట్లో అఫ్గానిస్థాన్, మధ్య ఆసియా దేశాల నుంచి మనుషులను తెచ్చుకునేందుకు ప్రయత్నించినా మొఘల్‌లు సాగనివ్వకపోవడంతో ఆఫ్రికాపై దృష్టిపెట్టారు.

భారత పశ్చిమ ప్రాంతం మీదుగా సముద్ర మార్గంలో ఆఫ్రికా చేరుకోవటం సులువు. దీంతో అక్కడి నుంచి మనుషులను తెచ్చేవారు. ప్రధానంగా ఈశాన్య, తూర్పు ఆఫ్రికా దేశాల నుంచి హబ్సిలు, సీదీలు, జాంగీలను భారతీయ రాజులు, సుల్తానులు తీసుకొచ్చేవారు.

మూలాలు చెరిగిపోయాయి.. చరిత్ర మిగిలింది:

అహ్మద్‌నగర్‌ను ఏలిన మాలిక్ అంబర్ సమాధి అక్కడికి సమీపంలోని ఖుల్దాబాద్‌లో ఇప్పటికీ ఉంది. మాలిక్ అంబర్ ఆ ప్రాంతాన్ని పాలించినట్లు అక్కడివారికి తెలిసినా ఆయన ఇథియోపియాకు చెందిన వ్యక్తన్న సంగతి తెలిసినవారు అరుదు.

Comments
Loading...