Best Telugu News Portal.

మరణంతో మెదడు పోరాడుతుందా? మనిషి చనిపోయే ముందు ఏం జరుగుతుంది?

0

అసలు మనిషి చనిపోయే సమయంలో ఏం జరుగుతుంది? ఇది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. కొన్ని పరిశోధనల ద్వారా శాస్త్రవేత్తలు ఈ చిక్కుముడిని విప్పడానికి ప్రయత్నిస్తున్నారు.

యూనివర్శిటీ ఆఫ్ చారిటీ జర్మని మరియు సిన్సినాటీ యూనివర్శిటీ అమెరికా పరిశోధకులు ఈ విషయంలో గణనీయమైన ప్రగతి సాధించారు. వీరు మనవ నాడీ వ్యవస్థకు సంబంధించిన కొత్త విషయాలను బయటపెట్టారు. జెన్స్ డ్రీర్ ఈ పరిశోధనకు నాయకత్వం వహించారు.

వీరు నాడీ వ్యవస్థ దెబ్బతిని, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారి మెదడుపై పరిశోధనలు జరిపారు. వారందరూ వేర్వేరు కారణాలతో చనిపోయారు. కొందరికి గుండెనొప్పి వచ్చింది. మరికొందరు కార్డియాక్ అరెస్ట్‌తో మరణించారు. వీటిని ఒక క్రమపద్ధతిలో చెప్పడానికి వీలులేదు. ఈ అధ్యయనం సమయంలో సైంటిస్టులు ఒక విషయం గుర్తించారు. అది మానవుల మెదడు మరియు జంతువుల మెదడు ఒకే రకంగా నశించడాన్ని కనిపెట్టారు.

వీరు తమ పరిశోదనలో ఒక అద్బుతమైన విషయం తెలిపారు. అదేంటంటే సరైన సమయంలో ప్రయత్నిస్తే మెదడును మళ్లీ పనిచేసేలా చేయవచ్చని. వీరి పరిశోధన ప్రధాన లక్ష్యం కూడా ఇదే కావటం గమనార్హం. మరణానికి ముందు మన మెదడు ఎలా స్పందిస్తుందో తెలుసుకోవడమే కాదు ఆ ప్రమాదం నుంచి, మరణం నుంచి మనుషుల్ని ఎలా కాపాడాలో తెలుసుకోవడమే ఈ పరిశోధన ముఖ్య ఉద్దేశం.

జంతువుల్లో ఇలా..

20వ శతాబ్దంలో జంతువులపై చేసిన పరిశోధనల ఫలితంగానే మెదడు మరణానికి సంబంధించి పలు విషయాలు శాస్త్రవేత్తలకు తెలిశాయి. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం గుండె (హృదయం) పనిచేయడం ఆగిపోవడంతోనే మెదడుకు ఆక్సిజన్ అందదు. దీని ద్వారా మెదడుకు రక్త సరఫరా నిలిచిపోతుంది. దీని ద్వారా మెదడు పనిచేయడానికి అవసరమైన రక్తం గుండె నుంచి సరఫరా కాదన్న విషయం తెలుస్తుంది. ఈ స్థితిని వైద్య పరిభాషలో ‘సెరెబ్రల్ ఇస్కీమియా’ అంటారు.

క్రమంగా మెదడు అచేతనంగా మారిపోతుంది. ఆ స్థితిలో మెదడులోని న్యూరాన్లు తమ శక్తిని కాపాడుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తాయి. కానీ మరణానికి కొన్ని క్షణాల ముందు వాటి ప్రయత్నాలు ఎంతమాత్రం ఫలించవు. ‘అడెనోసిన్ ట్రిఫాస్ఫేట్’ క్షీణించడంతో మెదడు నుంచి ముఖ్యమైన ఆయాన్లు అన్నీ వెళ్లిపోతాయి.

మెదడుకి శక్తిని నిల్వ చేయడంతో పాటు దాన్ని శరీరం మొత్తం పంపిణీ చేయడానికి ‘అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్’ సహకరిస్తుంది. మెదడులో ‘అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్’ క్షీణించడంతో కణాల రికవరీ అసాధ్యంగా మారుతుంది. ఇదంతా కేవలం పది నిమిషాల్లోనే జరిగిపోతుంది. ఆక్సిజన్, రక్త సరఫరా నిలిచిపోయిన 10 నిమిషాల్లో మెదడులోని కణాలు పూర్తిగా చనిపోతాయి.

మరి మనుషుల్లో ఎలా?

మనుషులు చనిపోవడానికి ముందు మెదడు ఎలా స్పందిస్తుంది? అన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఈ శాస్త్రవేత్తల బృందం ప్రయత్నించింది. ఇందుకోసం చావు బతుకుల్లో ఉన్న తొమ్మిది మంది రోగులపై పరిశోధన చేశారు. ఎలక్ట్రోడ్ స్ట్రిప్‌ల సహాయంతో వారి నరాల పనితీరును అధ్యయనం చేశారు.

9 మందిలో ఎనిమిది మంది రోగుల మెదడు కణాలు జరుగుతున్న పరిణామాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. మృత్యువు కబళించకుండా మెదడు కణాలు ప్రయత్నం చేసినట్లుగా తేల్చారు. సాధారణంగా న్యూరాన్లు ఆయాన్ల శక్తిని సంగ్రహించి పనిచేస్తాయి. తమలో, తమ పరిసరాల్లో ఎలక్ట్రానిక్ అసమతౌల్య స్థితిని సృష్టించి జీవిస్తాయి.

ఈ క్రమంలో అవి చిన్న చిన్న షాక్‌ల రూపంలో ఒక చోటు నుంచి మరోచోటికి సిగ్నల్స్ పంపిస్తాయి. ఆ అసమతౌల్య స్థితిని న్యూరాన్లు నిరంతరం కొనసాగిస్తాయి. కణాలు రక్తం నుంచి శక్తిని, ఆక్సిజన్‌ను గ్రహించి న్యూరాన్లకు కావాల్సిన శక్తిని అందిస్తాయి. అయితే, చనిపోయిన తర్వాత మెదడుకు రక్త సరఫరా ఆగిపోతుంది. ఫలితంగా న్యూరాన్లకు ఆక్సిజన్ అందదు. ఆ పరిస్థితిలో తమలో మిగిలిపోయిన శక్తిని న్యూరాన్లు సమీకరించుకుంటాయని పరిశోధకులు చెప్పారు.

చివరి క్షణాల్లో ఒక చోటు నుంచి మరో చోటుకి సిగ్నల్స్ పంపించడం వృధా ప్రయాస. అందుకే న్యూరాన్లు నిశబ్దంగా ఉంటాయి. తిరిగి రక్త ప్రసరణ కోసం న్యూరాన్లు ఎదురుచూస్తూ ఉంటాయి. కానీ అది ఎప్పటికీ జరగదు. ఇలాంటి పరిస్థితి మెదడు మొత్తం ఒకేసారి ఎదురవుతుంది. దీన్ని వైద్య పరిభాషలో ‘అన్‌డిస్పర్స్‌డ్ డిప్రెషన్’ అంటారు. ఆ తర్వాత మెదడులో ఉష్ణ సునామీ వస్తుంది. దీన్ని ‘డీపోలరైజేషన్ ఆఫ్ డిఫ్యూజన్’ అంటారు.

మెదడు కణాలను సజీవంగా ఉంచే ఎలక్ట్రో-కెమికల్ సమతౌల్యం దెబ్బతినడం వల్ల ఈ అసాధారణ ఉష్ణ శక్తి వెలువడుతుంది. మెదడు కణాలు మొద్దుబారడానికి, ధ్వంసం కావడానికి ఇది కారణం అవుతుంది. క్రమంగా ఆక్సిజన్ సరఫరా పూర్తిగా తగ్గిపోవడంతో మెదడు మొత్తం మొద్దుబారిపోయింది. పరిశోధకులు అధ్యయనం చేసిన అందరు రోగుల్లోనూ ఇలాగే జరిగింది.

అయితే, మరణానికి ఇదొక్కటే కారణం కాదని, ఎన్నో అంశాలు దీనితో ముడిపడి ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. మెదడు మరణాన్ని ఆపడం ప్రస్తుతం సాధ్యం కాకపోవచ్చు. కానీ ఆ రోజు ఎంతో దూరంలో లేదని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Comments
Loading...